చైనా జూమ్‌కు పోటీ.. తెలుగోడి 42 యాప్

చైనా ‘జూమ్‌’ యాప్‌కు దీటైన వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ రూపొందించినవారికి భారత ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. బెజవాడకు చెందిన రాజశేఖర్‌ (35) అనే టెకీ. ప్రభుత్వం ఆ ప్రకటన చేసే సమయానికే జూమ్‌ను మించిన యాప్‌ను రూపొందించేశాడు. దాని పేరు ‘42’.

లాక్‌డౌన్‌ వేళ చాలా పాఠశాలలు పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడానికి వాడుతున్న వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌. కానీ, జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ అంత శ్రేయస్కరం కాదని కేంద్రం ఆ యాప్‌ను తమ కార్యాలయంలో నిషేధిస్తున్నామని గూగుల్‌ ప్రకటించడంతో అంతా ఆలోచనలో పడ్డారు. దానికి బదులుగా ఏవైనా ఉచిత వీడియోకాన్ఫరెన్స్‌ యాప్‌లు ఉన్నాయా అని చూడటం మొదలుపెట్టారు.

ఏపీలోని విజయవాడకు చెందిన రాజశేఖర్‌ ‘42’ పేరుతో జూమ్‌కు దీటైన మొబైల్‌ యాప్‌ను రూపొందించాడు. ఫర్‌, టు అనే రెండు పదాలూ కలిసొచ్చేలా రాజశేఖర్‌ తన యాప్‌కు ఈ పేరు పెట్టాడు. అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్శిటీ ఈ యాప్‌ను పైలట్‌ పద్ధతిన పరీక్షిస్తుండగా హార్వర్డ్‌ యూనివర్సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) ఈ యాప్‌ పనితీరు గురించి తెలుసుకోవడానికి మే 3న రాజశేఖర్‌తో 42 యాప్‌ ద్వారానే కనెక్ట్‌ అయ్యారు. అతడు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను తిలకించి జూమ్‌ యాప్‌ కన్నా అదనపు ఫీచర్లతో, రక్షణలతో రూపొందించిన ఆ యాప్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.

త్వరలోనే ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి, ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌లోకి రాబోతోంది. రాజశేఖర్‌కు తల్లిదండ్రులు లేరు. విజయవాడ కృష్ణలంకలో మేనమామల వద్ద పెరిగాడు. పదో తరగతి, ఇంటర్‌ వరకూ విజయవాడలోనే చదివిన రాజశేఖర్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అమెరికాలో చేశాడు. ‘42’ యాప్‌కు తొమ్మిది నెలల క్రితమే రూపకల్పన చేశాడు. ముందుగా ‘42’ పేరుతోనే ఎడ్యుకేషన్‌ ఇన్ఫో తయారు చేశాడు.

సాధారణంగా వీడియోకాన్ఫరెన్స్‌ యాప్‌లు ఫ్రీ ట్రయల్‌, ప్రీమియం వెర్షన్‌లో ఉంటాయి. రాజశేఖర్‌ 42 యాప్‌ కూడా ఈ రెండు వెర్షన్లలో వస్తోంది. ప్రీమియం వెర్షన్‌ ఉపయోగించుకోవాలంటే మిగిలిన ప్రముఖ యాప్స్‌ కంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ట్రయల్‌ వర్షన్‌ను 30 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. ట్రయల్‌వెర్షన్‌లో చాలా యాప్‌లు పరిమిత సంఖ్యలోనే వీడియోకాన్ఫరెన్స్‌కు అనుమతిస్తాయి. కానీ 42 యాప్‌ ద్వారా ఎంత మంది అయినా కనెక్ట్‌ కావచ్చు. భ ద్రతపరంగా మరో ముఖ్యమైన ఫీచర్‌ ఏంటంటే ఏ దేశంలోని వారు ఈ యాప్‌ను ఉపయోగిస్తే వారికి సంబంధించిన డేటా అదే దేశంలోని సర్వర్‌లో నిక్షిప్తమయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అన్నిదేశాలూ సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్‌ రికార్డింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

SOURCE: ఆంధ్రజ్యోతి, సాక్షి, ది హిందూ, టీఓఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *